తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ” తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం విద్య రంగానికి అధిక
ప్రాధాన్యత ఇస్తుంది. అంబేద్కర్ గారు కన్న కలలను నిజం చేసే క్రమంలో ఈ రంగాన్ని పటిష్టం చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 970గురుకులాలను ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో కార్పోరేట్ స్థాయి మౌలిక వసతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాము. ఈ సౌకర్యాల కల్పన కోసం ఈ ఏడాది రూ.2వేల కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. అంటే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కమిటీలో తనతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల టీచర్ల జీతాలపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిరావు కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి సబితా పేర్కొన్నారు.