Home / SLIDER / టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం (టిడిఎల్పీ), టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో పూర్తిస్థాయిలో విలీనం అయింది. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను బుధవారం శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు అధికారికంగా విడుదల చేశారు.తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయమని టీడీఎల్పీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావులు చేసుకున్న వినతిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అదే సమయంలో తాము వారి విలీనానికి అంగీకారం తెలిపామని, టీఆర్ఎస్ ఎల్పీ అందించిన సమాచారాన్ని స్పీకర్ అందుకున్నారు. అనంతరం దాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనాన్ని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లోని నాలుగో పేరా ప్రకారం ఆమోదించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులతోపాటుగా సీట్లను కేటాయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బులెటిన్ లో ప్రకటించారు.

శాసన సభ్యులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి మెచ్చ నాగేశ్వర్ రావులు ఇప్పటిదాకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాగా తాము టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం కాదలుచుకున్నట్టు బుధవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి లేఖను అందించారు. వారు టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యేందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో పొందుపరిచిన నాలుగవ పేరా ప్రకారం అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు స్పీకర్ వారి విలీనాన్ని ఆమోదించారు. దాంతో అధికారిక ప్రకటన విడుదలైంది.

టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం ద్వారా శాసన సభలో తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ పూర్తిస్థాయిలో కనుమరుగయింది.రాజ్యంగంలోని పదవ షెడ్యూలు నాలుగవ పేరాలో పొందుపరిచిన నిబంధన ప్రకారం… ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల 2/3 సభ్యులు, తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే రాజ్యాంగపరంగా అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. కాగా, తెలుగుదేశం పార్టీలో వున్నదే ఇద్దరు ఎమ్మెల్యేలు… ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నందున శాసన సభలోని నూటికి నూరు శాతం టిడిపీ సభ్యులు టిఆర్ఎస్ లో విలీనమైనట్టయింది.

వీరిద్దరూ ఇకనుంచి పూర్తిస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులుగానే కొనసాగనున్నారు.కాగా, టిడిఎల్పీని టిఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసిన నేపథ్యంలో, తాము తీసుకున్న విలీనం నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా లేఖను అందచేస్తూ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర రావులు ప్రగతి భవన్ లో బుధవారం కలిశారు. తమ టిడిఎల్పీ విలీనాన్ని ఆమోదించాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ కు లేఖ అందించారు.ఈ కార్యక్రమంలో శాసన సభా పక్ష నేత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.