Home / EDITORIAL / తొలగుతున్న ముసుగులు!

తొలగుతున్న ముసుగులు!

రాజు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనప్పుడు ద్రోహులందరూ ఒకచోట చేరతారని చాణక్య సూక్తి. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అని ప్రకటించుకున్న ఈటల ఆ మాట మరిచి, మాటను మార్చి కాషాయ నీడలో సేదదీరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ తీర్థం సేవించడం కోసం ఆయన బీజేపీ నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని, కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారట. ఒప్పందాలున్న చోట షరతులూ ఉంటాయి. మరి బీజేపీ ఏమి షరతులు విధించిందో, ఈటల షరతులేం పెట్టారో తెలియదు. కానీ, బీజేపీ మర్రిచెట్టు కింద కాసింత చోటు, కాంగ్రెస్‌తో కొంచెం రహస్య పొత్తు ఖరారైన తర్వాత ఈటల రాజీనామా చేస్తారట!

ఆంధ్రా పాలకులు తెలంగాణ భూములను కబ్జాలు చేస్తున్నారని, ఆక్రమిస్తున్నారని, మన భూమి మనదే అని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ గర్జించారు. తెలంగాణలో అభివృద్ధి చేయకుండా, భూముల ధరలను ఆంధ్రా ప్రాంతంతో పోల్చితే పెరగకుండా చేసి ఈ గడ్డ మీద ఎకరాల కొద్దీ భూములను కారు చౌకగా కొనేశారని నాడు టీఆర్‌ఎస్‌ ఆందోళన చేసింది. ఆంధ్రాలో ఎక రం అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు దొరికే సమయం అది. నాటి భూ దోపిడీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేసిన పోరాటంలో ఈటల కూడా ఒక సైనికుడు. మరి అలాంటి సైనికుడే, ఇంట్లోవాడే కంట్లో పొడిచాడన్నట్లు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను కూడా ఆక్రమించారని తెలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే దిగ్భ్రాంతికి గురైంది. ఈటల భూ బాగోతాలు కూలంకషంగా రహస్య విచారణ ద్వారా ధ్రువపరచుకున్న తర్వాతే కేసీఆర్‌ కన్నెర్ర జేశారు. ఆంతరంగిక మిత్రుడు, ఉద్యమ సహచరుడని కూడా దయాదాక్షిణ్యాలు కనపరచకుండా మంత్రిమండలి నుం చి వేటువేసి రాజధర్మాన్ని పాటించారు.

తన మీద ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆత్మగౌరవం కలిగిన ఏ నాయకుడైనా వెంటనే పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తాడు. మరి తనకు ఆత్మగౌరవం ఎక్కువని చెప్పుకొనే ఈటల మంత్రి పదవినుంచి తొలగించినందుకు నిరసనగా రాజీనామా చేయలేదు ఎందుకో?

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, నిన్నటి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కానీ తన సత్తా ఏమిటో, కేసీఆర్‌ నాయకత్వ పటిమ ఏమిటో మరోసారి దేశానికి స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవడం అసాధ్యం. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా పోటీలో నిలబడితే ఈటల గెలిచే ప్రసక్తే లేదు. అందుకే ఆ రెండు పార్టీలు బరిలో నిలబడకుండా నిలువరించడానికి ఈటల ఆ రెండు పార్టీలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ మీద నిప్పులు, ద్వేషం కక్కే ఆ పార్టీలు తాము పోటీకి దూరంగా ఉంటామని హామీ ఇస్తే అప్పుడు ఈటల ధైర్యంగా రాజీనామా చేస్తా రు! ఇదీ ఈటల ప్రదర్శిస్తున్న ఆత్మగౌరవం!

తాను రాజీనామా చేయకపోవడానికి కొవిడ్‌ పరిస్థితులే కారణమని, ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని ఈటల చెప్పడం హాస్యాస్పదం. ఇక ఈటల కబ్జా చేసిన వందల ఎకరాల భూముల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఈటల దోషిగా తేలడం ఖాయం. ఎందుకంటే అసైన్డ్‌ భూములను కొన్నానని తానే అంగీకరించారు. ఆ ఒక్కటి చాలదా చట్టాలను ఆయన ధిక్కరించారని చెప్పడానికి! ఇప్పుడు చట్టం కోరల్లోంచి తప్పించుకోవాలని ఆయన బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయం ఇవ్వడంలో బీజేపీ కల్పవృక్షంలా తయారైంది. ఎంతో మంది ఆర్థిక ఉగ్రవాదులు కాషాయ కండువా కప్పుకొని చల్లగా బతికేస్తున్నారు. ఈటల కూడా అదే బాటలో నడవదలచుకుంటే ఆయనిష్టం కానీ ప్రస్తుతం ఆయన తెలంగాణ సమాజపు ఛీత్కారాన్నే చవిచూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా ఆ గెలుపు వెనకున్నది కేసీఆర్‌ అనే మూడక్షరాల పేరు. తమ అవినీతిని, అక్రమాలను సహిస్తే కేసీఆర్‌ దేవుడు, చర్యలు తీసుకుంటే దెయ్యం అని వీరంగాలు వేసినవారంతా సోదిలోకి లేకుండా పోయారు.

ఒక్కటి మాత్రం నిజం. నాయకులు కేసీఆర్‌ను తయారు చేయలేదు. కేసీఆర్‌ వందలమంది నాయకులను తయారుచేశారు. కేసీఆర్‌ జనం వెంట పడలేదు. జనం కేసీఆర్‌ వెంట పడ్డారు. అరవై ఏండ్ల తమ కలను పండించిన కేసీఆర్‌ విరిసిన గులాబీ సుగం ధం. రేకులు, ముళ్ళు అన్నీ ఆయనవే. ముళ్ళ ను కేసీఆర్‌కు గుచ్చుతూ రేకులు మావేనని ఎవరైనా చెప్పుకోదలచుకుంటే వారి విజ్ఞతను శంకించాల్సిందే.

-ఇల పావులూరి మురళి మోహన్ రావు
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)