తెలంగాణలో వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు అవసరంకాగా, నిధు లను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది.
గత యాసంగితో పోల్చితే ఈసారి రైతుబంధు అర్హుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 2,81,865 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. భూ విస్తీర్ణం కూడా పెరిగింది. కొత్తగా 66,311 ఎకరాలు రైతుబంధు పరిధిలోకి వచ్చింది. ధరణి పోర్టల్ వచ్చాక పార్టీ-బీలోని భూములు పార్ట్-ఏలోకి వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు పరిష్కారమయ్యాయి.