Home / EDITORIAL / ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల

ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్‌షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. చివరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కాస్త ఖాళీగా కనిపించారేమో.. ఆయన్ను పిలిపించి మమ అనిపించేశారు. ఈ తతంగంపై ఈటల అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ మాత్రం దానికి ఢిల్లీకి రావాల్సిన అవసరం ఏమున్నదని.. అదేదో హైదరాబాద్‌లోనే చేరితే కనీసం ప్రత్యేక విమానం ఖర్చులైనా మిగిలేవని వాపోయినట్టు సమాచారం.

అధ్యక్షుడి స్థాయికి కూడా సరిపోలేదా?
సాధారణంగా ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకోవాలంటే ఓ స్థాయి నాయకుడైతేనే జాతీయ అధ్యక్షుడు స్వయంగా చేర్చుకొంటారు. గతంలో డీకేఅరుణ, జితేందర్‌రెడ్డి వంటి నాయకులు అప్పటి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలోనే పార్టీ లో చేరారు. ఈటల విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందంటేనే ఆయనకు బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన విలువ ఏపాటిదో అర్థమవుతున్నది. పార్టీలో చేరిక సంపూర్ణమైన తర్వాత ఈటల వెళ్లి నడ్డాను కలవడం విశే షం. అదేదో.. ఆయనే చేరిక కార్యక్రమానికి వస్తే సరిపోయేది కదా అని అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమం తర్వాత కలిసిన నడ్డా.. అంతకుముందు రాకపోవడంలో మర్మమేమిటనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆయన కోసం మేం బలవుతున్నామా!
కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, పార్టీలో చేరిక కార్యక్రమం నామమాత్రంగా తేలిపోవడంతో ఈటల వెంట నడుస్తున్న నేతలు, అనుచరుల్లో ఆందోళన నెలకొన్నది. ఈటలకోసం తమను తాము బలి చేసుకుంటున్నామా? అనే ఆలోచన వారిలో మొదలైంది. బీజేపీలో చేరితే ఏదో జరుగుతుందని అతిగా ఊహించుకొని వస్తే.. భవిష్యత్‌ శూన్యంగా కనిపిస్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పుడే ప్రాధాన్యం ఇవ్వకపోతే.. భవిష్యత్‌లో ఏమిస్తారనే అనుమానాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిది ఓ గ్రూప్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌, వివేక్‌ది ఒక గ్రూపు ఉన్నది. ఈ రెండు గ్రూపుల మధ్య అంతర్గతంగా చిన్నస్థాయి యుద్ధమే సాగుతున్నది. ఇది ఎప్పుడు పేలుతుందో.. ఎవరు బలవుతారో తెలియని పరిస్థితుల్లో ఈటల వస్తే మరో గ్రూపు తయారవుతుందే తప్ప.. ప్రయోజనం ఉండదనే మాటలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని అమిత్‌ షా

బీజేపీలో ఈటల చేరిక కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తే.. బీజేపీ అధినాయకత్వం ప్రాధాన్యమిచ్చినట్టు కనిపించడం లేదు. తనను తాను కాపాడుకొనేందుకే బీజేపీలో చేరారు తప్ప.. ఆయన వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం లేదనే భావన కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నది. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన ఈటలను కలుసుకునేందుకు అమిత్‌షా ఇప్పటివరకు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఈటల ఢిల్లీకి ‘అప్‌ అండ్‌ డౌన్‌’ చేస్తున్నారు. ఇన్నిసార్లు వెళ్లినా.. ఒక్కసారి కూడా అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. అందర్నీ కలుస్తున్న అమిత్‌షా.. ఈటలను మాత్రం ఎందుకు దూరం పెడుతున్నారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పార్టీకి ఈటల అవసరముంటే అమిత్‌షా తప్పకుండా కలిసేవార ని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన కారణాలు, భూ ఆక్రమణల ఆరోపణలపై ఇప్పటికే అమిత్‌షా ఆరా తీసినట్టు తెలిసింది. ఈటలతో పార్టీకి ఒనగూరేదేమీ లేదనే అభిప్రాయంతో అమిత్‌ షా ఉన్నట్టు తెలిసింది. పార్టీలోకి వస్తా అన్నారు కాబట్టి.. కాదనలేక తీసుకొన్నామే తప్ప.. అంతకుమించి ఏమీ లేదనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతున్నది