Home / EDITORIAL / పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడీ ఆగాల్సిందే..

పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడీ ఆగాల్సిందే..

తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు, హైదరాబాద్‌కు తాగునీరు, మిషన్‌ భగీరథ తాగునీటి పథకాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక పంటకు సాగునీటికి, తాగునీటికి అలమటిస్తుంటే, కృష్ణా బేసిన్‌ అవతల పెన్నా బేసిన్‌లో ఐదారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పెద్ద ఎత్తున నీటిని తరలించే ఈ పథకాలు పూర్తిగా అక్రమమైనవి.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో ఉన్న పై ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి రాష్ట్రం అనుమతించినపాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు నికర జలాల కేటాయింపు చేయాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట వాదిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా తెలంగాణకు న్యాయమైన నీటి కేటాయింపులు ట్రిబ్యునల్‌ నిర్ధారించలేదు.2005-06లో వైఎస్‌ ప్రభుత్వం 10 అదనపు గేట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఈ పెంపును సవాల్‌ చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్‌ 44 వేల క్యూసెక్కులను 88 వేలకు పెంచాడు. ఇది అక్రమం.
నేడు అమల్లో ఉన్న ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఎగువ రాష్ర్టాలకు 75 శాతం డిపెండబిలిటీ వద్ద కేటాయించిన మొత్తాలు వాడుకున్నాక దిగువకు వచ్చే నీళ్లను తెలంగాణ, ఏపీ వాడుకునే వెసులుబాటున్నది. హక్కుగా కాదు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆ నీళ్లను కూడా మూడు రాష్ర్టాలకు పంచింది. బ్రిజేష్‌కుమార్‌ అవార్డు అమల్లోకి రాకుండా సుప్రీం నిలిపివేసినందున ఇప్పటికీ బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమ ల్లో ఉన్నది. దాని ఆధారంగానే వరదజలాల వినియో గం కోసం ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు; రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మొదలైనవి ప్రతిపాదించింది. తెలంగాణ ప్రాజెక్టులకు 77 టీఎంసీలు, ఆంధ్రా ప్రాజెక్టులకు 150 టీఎంసీల వరదజలాలు కేటాయించారు. వరదజలాల కేటాయింపుల్లో కూడా తెలంగాణ పట్ల వివక్షను చూపించారు ఉమ్మడి పాలకులు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో ఉన్న పై ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి రాష్ట్రం అనుమతించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు నికర జలాల కేటాయింపు చేయాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట వాదిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా తెలంగాణకు న్యాయమైన నీటి కేటాయింపులు ట్రిబ్యునల్‌ నిర్ధారించలేదు.
కృష్ణా నదినే మలుపుకపోయే కుట్ర
ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడం ఆందోళన కలిగించే విషయం. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం ఇది మూడోసారి. మానవతా దృక్పథంతో 15 టీఎంసీల నీటిని 15 వందల క్యూసెక్కులతో చెన్నై తాగునీటి ప్రాజెక్టుపై మూడు రాష్ర్టాల మధ్య ఒప్పందం 1976-77లలో కుదిరింది. ఆ తర్వాత 19 టీఎంసీల శ్రీశైలం కుడిగట్టు కాలువను తెరపైకి తెచ్చి, చెన్నై తాగునీటి పథకంతో కలిపి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కులకు పెంచారు. తర్వాత దానికి తెలుగు గంగ కాలువ అని పేరు పెట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను నాలుగు గేట్లతో 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎన్టీఆర్‌ హయాంలో నిర్మించారు. పోతిరెడ్డిపాడు నుం చి ఏపీ తరలించగలిగే నికరజలాలు 34 టీఎంసీలే. 2005-06లో వైఎస్సార్‌ ప్రభుత్వం 10 అదనపు గేట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఈ పెంపును సవాల్‌ చేయడం జరిగింది. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వైఎస్సార్‌ తనయుడు 44 వేల క్యూసెక్కులను 88 వేలకు పెంచాడు. ఇది అక్రమం. పోతిరెడ్డిపాడు వద్ద పాతవి నాలుగు గేట్లు, కొత్తవి 10 గేట్లున్నాయి. శ్రీశైలం ప్రధాన కుడి కాలువను లైనింగ్‌ చేసినట్లయితే ఆ కాలువ కొలతలేమీ మార్చకుండానే 88,800 క్యూసెక్కులను పంపవచ్చు. అంటే రోజుకు 7.67 టీఎంసీలను తరలించవచ్చు. వరద ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా, వరద లేనప్పుడు సంగమేశ్వరం వద్ద ప్రతిపాదించిన రాయలసీమ పంపింగ్‌ సిస్టం ద్వారా తరలిస్తారు. వరద జలాలను మాత్రమే తరలిస్తామని వారు చెప్తున్నప్పటికీ 797 అడుగుల లోతులో రాయలసీమ పంపింగ్‌ లెవెల్‌ పెట్టారు. అంటే శ్రీశైలంలో ఏ మట్టంలో నీరున్నా ఆ నీటిని తరలించగలిగే ఏర్పాట్లు వారు చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడుకు అదనంగా శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి వద్ద నిర్మించిన హంద్రీ-నీవా లిఫ్ట్‌ పథకం ద్వారా 3850 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌ లిఫ్ట్‌ పథకం ద్వారా వెయ్యి క్యూసెక్కులు, వెలిగొండ టన్నెల్‌ ద్వారా 11, 570 క్యూసెక్కుల చొప్పున.. రోజుకు 1.42 టీఎంసీలు తరలిస్తారు. అంటే శ్రీశైలం నుంచే రోజుకు మొత్తం 7.67+1.42=9.09 టీఎంసీలు మళ్లించే సామర్థ్యం ఏపీకి ఏర్పడుతుంది. ఈ నీరంతా పెన్నా బేసిన్‌కు తరలిపోతాయి. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఇంకా రెండు రాష్ర్టాలకు కేటాయింపులు జరపకముందే ఇంత పెద్దఎత్తున నీటిని తరలించే పథకాలు చేపట్టడం నీటి దోపిడి కాకపోతే మరేమిటి? తెలంగాణ సంగతి చూస్తే.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ద్వారా 4 వేలు, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా 23,150, కల్వకుర్తి నుంచి 3200 క్యూసెక్కులు.. మొత్తం 30,350 క్యూసెక్కులు.. అంటే రోజుకు 2.62 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి తరలించే అవకాశం తెలంగాణకు ఉంటుంది.
కోర్టు, కేంద్రం ఆదేశాలు ఉల్లంఘించి
ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ర్టాలు తప్పనిసరిగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సిఫారసుతో అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకొని మాత్రమే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. ఏపీ ఈ చట్టాన్ని బేఖాతరు చేసి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. బాబు హయాంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం తదితర ప్రాజెక్టులను నిర్మించింది. ఏపీ నిరంతరాయంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు చేపడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతి పొందిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను, తర్వాత అనుమతులు పొందిన కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను నిలిపివేయమని కేంద్రానికి శికాయతులు చేస్తున్నది. ఇదీ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు నాలుకల ధోరణి. కేంద్ర జలశక్తి మంత్రి, కేఆర్‌ఎంబీ, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సైతం ధిక్కరించి రాయలసీమ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నది. ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ కోసం సర్వే పనులు మాత్రమే కొనసాగిస్తున్నామని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు చెప్పిన ఆంధ్రప్రదేశ్‌, వందలాది టిప్పర్లు, మట్టిని తవ్వే భారీ యంత్రాలు, కాంక్రీట్‌ బ్యాచింగ్‌ ప్లాంట్‌, కంకర క్రషింగ్‌ ప్లాంట్లను భారీగా పనులు చేయడానికి కాకపోతే ఎందుకు నెలకొల్పినట్టు? ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం లేఖలు రాసి తమ పనయిపోయినట్టు చేతులు దులుపుకొన్నది. తమ ఆదేశాలను అమలు చేయించడంలో కేంద్రం విఫలమైంది. కాబట్టే న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తలుపులు తట్టవలసి వచ్చింది. ఎన్జీటీ తొలుత పనులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఆ తర్వాత సమగ్ర విచారణ అనంతరం 2021 ఫిబ్రవరిలో పర్యావరణ అనుమతి పొందేవరకు ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని ఆదేశించింది.
రాజీలేని పోరాటం
కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 2020 అక్టోబర్‌లో జరిగిన రెండవ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా వాదించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలుచేస్తున్నది. కృష్ణాజలాల్లో న్యాయంగా రావలసిన 565 టీఎంసీల వాటా కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపిస్తున్నది.
కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు, డిం డి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించమని ట్రిబ్యునల్‌కు నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను అనుమతులు పొందకుండా కొనసాగించినట్టయితే తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను కాపాడటానికి, కృష్ణా జలాలపై తమ హక్కు ను స్థిరపరచుకోవడానికి తాము ఆలంపూర్‌ వద్ద రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేందుకు బ్యారేజీని నిర్మిస్తామ ని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే ప్రకటించారు. వారికి తగినంత సమయాన్నిచ్చి, అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ప్రతిచర్యగా కృష్ణా జలాల వినియోగం కోసం జోగులాంబ బ్యారేజీ సహా మరికొన్ని పథకాల ను ప్రభుత్వం ప్రకటించింది. ఇది అనివార్యమైన ప్రతిచర్య. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి తెలంగాణ సమాజం కలసికట్టుగా నిలబడి ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది.
– శ్రీధర్‌రావు దేశ్‌పాండే

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat