Home / SLIDER / చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్‌ లైన్‌-మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్‌ లైన్‌-మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీకి రూ.800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

రూ.2 కోట్ల వ్యయంతో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులకు, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సుమిత్ర ఎన్‌క్లేవ్‌ కాలనీలో రూ.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్‌ సంరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి చెరువులను పరిశీలించి పలుచోట్ల మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ అల్మాస్‌గూడ నుంచి మీర్‌పేట పెద్దచెరువు వరకు చెరువులు, నాలాల అభివృద్ధికి రూ.24 కోట్లు కేటాయించారన్నారు. నాదర్‌గుల్‌, బాలాపూర్‌లలోని చెరువులను కూడా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్‌, తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి,బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, పద్మ, ముత్యాల లలిత కృష్ణ, సూర్ణగంటి అర్జున్‌, పెద్దబావి సుద్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాతం పవన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాయకులు రాళ్లగడెం శ్రీనివాస్‌రెడ్డి, కుంచ నాగేందర్‌, లిక్కి కృష్ణారెడ్డి, చప్పిడి సంతోష్‌రెడ్డి, జి శ్రీనివాస్‌, కామేష్‌రెడ్డి, తుపాన్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.