Home / EDITORIAL / తెలంగాణలో పల్లెలు ప్రగతి తొవ్వబట్టినయ్-Telangana Vijay Editorial

తెలంగాణలో పల్లెలు ప్రగతి తొవ్వబట్టినయ్-Telangana Vijay Editorial

పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది..గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది.

అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది.గోసరిల్లిన పల్లెల గోసతీరింది.ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్‌ ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ కనపడ్డది..పల్లెలు ప్రగతి బాటపట్టినయ్‌..అభివృద్ధికి తొవ్వ జూపినయ్‌..

నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ పాలన బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ భూభాగం, సమస్యలు, పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకత్వం కేసీఆర్‌ రూపంలో మనకు దక్కింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాగునీరు, తాగునీరు తదితర మౌలికరంగాలు, కులవృత్తులను కొత్తపుంతలు తొక్కించే ఆలోచనలను ఆచరణలో పెట్టారు.

గ్రామానికి బలం ఊరి చెరువు.. చెరువుపై ఆధారపడి వ్యవసాయపనులు, కులవృత్తులు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఊరి చెరువు బాగుంటే ఊరంతా పనే. ఈ కీలకమైన విషయానికి కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగుచేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మాణం చేసి సాగునీటి కష్టాలు తీర్చారు. పరాయి పాలనలో ప్రాజెక్టులంటే శిలాఫలకాలుగా చూసిన ప్రజలకు తెలంగాణలో ప్రాజెక్టులంటే నీళ్లు పారటం అని కళ్లారా చూపించారు సీఎం కేసీఆర్‌. నాడు కరెంట్‌ అంటే- కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చీ రాని కరెంట్‌తో రైతుల మరణాలు, పంటలెండి ఆత్మహత్యలు. కానీ నేడు కరెంట్‌ పోతే వార్త. రైతు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నడు. పంట పండించడం రాదని హేళన చేసిన చోట నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థితికి చేరింది.

గతంలో గ్రామాలంటే పేరుకుపోయిన చెత్త, కంపుకొట్టే మురుగు కాలువలు. అంతా గందరగోళంగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ‘పల్లె ప్రగతి’తో పల్లెల్లో నేడు అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. గ్రామాలకు వస్తూనే రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నయి. మరణించిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. గతంలో చెత్త ఎవరింటి వద్ద వారు కుప్పలు తెప్పలుగా వేసుకుని రోగాల పాలయ్యేవారు. కానీ నేడు ఊరికో ట్రాక్టర్‌ ఏర్పాటు చేయటం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా జరుగుతూ పల్లెలు పరిశుభ్రంగా మారాయి.

తెలంగాణ వచ్చినంక మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. సంక్షేమం, సాగునీరు, తాగునీరు, ఉపాధి, కులవృత్తులు, గ్రామీణాభివృద్ది ఇలా అనేక రంగాల్లో తెలంగాణ పురోగతి సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారి కండ్లు తెరిపించారు. కేసీఆర్‌. ప్రతి రంగంలో తెలంగాణను విజయ బాటన నడిపారు. వారి సంకల్పం, కార్యదీక్ష, చిత్తశుద్ధితో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతున్నది. ఆరోగ్యవంతమైన గ్రామాలు, పట్టణాలు రూపుదిద్దుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం అవసరం. తెలంగాణకు మరిన్ని విజయాలను అందించటానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. కేసీఆర్‌ కోరుకున్న బంగారు తెలంగాణ సాధనలో చేయీ చేయీ కలిపి ముందుకు నడవాలి.

తెలంగాణ విజయ్‌-9491998702