Home / SLIDER / సకాలంలో రుణాలు అందించాలి -మంత్రి హారీష్ రావు

సకాలంలో రుణాలు అందించాలి -మంత్రి హారీష్ రావు

రైతులకు సకాలంలో రుణాలు అందించాలని, రైతుబంధు, ఫించన్లు, క్రాప్ రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు సూచించారు.సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంకు బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి, యూనియన్ బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, రీజనల్ మేనేజర్ జి.శంకర్ లాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజతో కలిసియూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకు బ్రాంచ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్న దృష్ట్యా పేద మధ్యతరగతి ప్రజలకు లోన్లు అందిస్తూ బ్యాంకు ఆదుకోవాలని కోరారు. రైతు బంధు,ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
త్వరలో ఫారెస్ట్ కళాశాలను ఫారెస్ట్ యూనివర్సిటీ చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, ఫారెస్ట్ కళాశాల విద్యార్థుల సౌలభ్యం కోసం ఉపయోగపడేలా కళాశాలలో బ్యాంకు సేవలు అందించాలని, యూనివర్సిటీ ఆవరణలో వాహనదారులకు కోసం ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రక్కన ఏటీఎం ఏర్పాటుకు యూనివర్సిటీ వారు బ్యాంకరుకు సహకరించాలని సూచించారు.

కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనమైన తర్వాత మొదటి బ్రాంచ్ ను సిద్ధిపేట జిల్లా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంకు వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు లక్షా 51 వేల బిజినెస్ చేపట్టినట్లు, దేశంలో 5వ స్థానంలో, తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంతో యూనియన్ బ్యాంకు సేవలు అందిస్తున్నదని మంత్రికి బ్యాంకు అధికార వర్గాలు వివరించారు. అంతకు ముందు ఉద్యానవన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, ఇతర బ్యాంకు అధికార వర్గాలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.