Home / SLIDER / హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు

హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌ది ఆత్మ‌గౌర‌వం కాదు.. ఆత్మ‌వంచ‌న అని పేర్కొన్నారు. ఈట‌ల త‌న‌తో పాటు.. ప్ర‌జ‌ల‌ను కూడా మోసం చేస్తున్నారు. ఈట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌర‌విమిచ్చిందో ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. ఆయ‌న‌కు టీఆర్ఎస్ పార్టీలో జ‌రిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఈట‌ల చేసిన త‌ప్పును తానే ఒప్పుకున్నారు. ఈట‌ల‌పై అనామ‌కుడు లేఖ రాస్తే సీఎం చ‌ర్య‌లు తీసుకోలేదు అని కేటీఆర్ తెలిపారు.

మంత్రిగా ఎందుకు కొన‌సాగారు

ఐదేళ్ల క్రిత‌మే ఆయ‌న ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటే మంత్రిగా ఎందుకు కొన‌సాగారు? ఐదేళ్ల నుంచి ఈట‌ల అడ్డంగా మాట్లాడినా కేసీఆర్ మంత్రిగా ఉంచారు. ఈట‌ల టీఆర్ఎస్‌లో కొన‌సాగేలా చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించాను. రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీలోకి రాక‌ముందు కూడా క‌మ‌లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ బ‌లంగానే ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఏ ఎన్నికైనా పార్టీల మ‌ధ్య‌నే..

ఏ ఎన్నికైనా పార్టీల మ‌ధ్యే.. వ్య‌క్తుల మ‌ధ్య కాదు అని కేటీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్యనే పోటీ ఉంటుంది అని స్ప‌ష్టం చేశారు.

బండి సంజ‌య్ పాద‌యాత్ర ఎందుకు?

బండి సంజ‌య్ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నారో చెప్పాలి? ప్ర‌జ‌ల‌కు ఏం అన్యాయం చేశామ‌ని పాద‌యాత్ర చేస్తున్నారు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కేంద్రం తెలంగాణ‌కు ఏం ఇచ్చింది? జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద అన్ని రాష్ర్టాల‌కు నిధులు ఇస్తుంది. తెలంగాణ‌కు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వ‌డం లేదు అని కేటీఆర్ మండిప‌డ్డారు.