Site icon Dharuvu

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతగా గతేడాది రూ.25 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీచేసింది. తొలివిడతలో దాదాపు మూడు లక్షల మంది రైతులు లబ్ధిపొందారు.ప్రస్తుతం చేపడుతున్న రెండో విడతతో కలుపుకొంటే రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య సుమారు 9 లక్షలకు చేరనున్నది.

మొత్తం నాలుగు విడతల్లో రుణమాఫీని అమలు చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం 2021-22 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5,225 కోట్లు కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలుచేస్తున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. అప్పుడు మొత్తంగా 35,29,944 మంది రైతులకు సంబంధించిన రూ.16,243 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నది.

Exit mobile version