Home / SLIDER / హుజూరాబాద్‌ లో దళితబంధు సంబురాలు

హుజూరాబాద్‌ లో దళితబంధు సంబురాలు

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్‌ మోడ్‌) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన

నిధులను హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజలు సంబురాలు చేసుకొన్నారు.

గ్రామగ్రామాన దండోరా మోగించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్‌ కలలుగన్న స్వప్నాన్ని సీఎం కేసీఆర్‌ సాకారం చేస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి, సీఎం కేసీఆర్‌ చిత్రటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామంలోని 76 కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను ఈ నెల ఐదోతేదీనే ప్రభుత్వం విడుదలచేసింది. దళితబంధు పథకం కోసం కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచారు. అందులోనే సోమవారం విడుదలచేసిన రూ.500 కోట్లను జమచేశారు. హుజూరాబాద్‌ నియోజకర్గంలో దళితబంధు లబ్ధిదారుల కోసమే ఈ నిధులను వినియోగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.