Home / SLIDER / త్వరలోనే పోడు భూములకు పరిష్కారం

త్వరలోనే పోడు భూములకు పరిష్కారం

ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు.

సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదివాసీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలను కల్పించిదన్నారు. గతంలో మాదిరిగా విష జ్వరాలతో ఆదివాసీలు మరణించే పరిస్థితిని నివారించిందన్నారు.గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

మిషన్‌ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని గోండు గూడేలకు సైతం స్వచ్ఛమైన తాగునీటిని అందించామన్నారు. ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసి, ఆదివాసీ విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా హైదరాబాద్‌లో కుమ్రం భీం భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఆదివాసీల దేవతలైన సమ్మక్క-సారలమ్మ, నాగోబా, సేవాలాల్‌ మహరాజ్‌ జాతరలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వీటికి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.