Home / SLIDER / విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి

విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి

 ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్‌ సందర్భంగా స్కూల్‌ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు.

వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈవోలు, డీపీవో, జడ్పీసీఈవోలు, డీఆర్డీవోలు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ నెల 30లోగా పాఠశాలలను శుభ్రంచేసి, శానిటైజ్‌ చేసినట్టు ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చేత సర్టిఫికెట్‌ తీసుకొని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసి, వాటికి మంచినీటి సరఫరా చేసే బాధ్యత కార్పొరేషన్ల మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులదేనని స్పష్టంచేశారు. ఇందుకు పంచాయతీలు, మున్సిపాలిటీల వద్ద అందుబాటులో ఉన్న నిధులను వాడుకోవాలని సూచించారు. పరిశుభ్రంగా ఉంచడం రెగ్యులర్‌ ప్రాసెస్‌ అని, ఇందులో విఫలమైతే సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి మాస్కులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.