అంతా ఊహించినట్టుగానే గుజరాత్‌లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ( Bhupendra Patel ) ఎంపికచేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు.
కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే, విజయ్ రూపానీ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో వినిపించిన కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, సీనియర్ నేత పరుషోత్తమ్ రూపాలా పేర్లను ఈ సమావేశంలో పరిగణలోకే తీసుకోలేదు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఇవాళ ఆ రాష్ట్ర శాసనసభాపక్షం సమావేశమైంది. గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ హాజరయ్యారు.