ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాజు ఆత్మహత్యపై అతడి అత్త యాదమ్మ ఏబీఎన్‌తో మాట్లాడారు. తన కుమార్తె మౌనిక జీవితం నాశనం చేశాడని చెప్పారు. తన కూతురు జీవితంలో మన్నుబోయడమే కాక మరో చిన్నారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని, అతడికి బతికే హక్కులేదని యాదమ్మ తెలిపారు.
ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడన్నారు. తన కుమార్తెకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ యాదమ్మ విచారం వ్యక్తం చేశారు. రాఖీ పండుగకు ముందు 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఇంట్లో గొడవలు జరిగాయని చెప్పారు. ఆ సమయంలో రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడన్నారు. ఇక ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదని యాదమ్మ వివరించారు.
రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉన్నాడు. పట్టణంలోని గోపాలపురంలో ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఉన్న ఒక గదిలో భార్యతో కలిసి నివసించాడు. 18 నెలల కిందట సూర్యాపేటకు వచ్చిన రాజు దంపతులు అక్కడ ఆరు నెలలపాటు ఉన్నారు. ఆ సమయంలో రాజు మద్యం తాగి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. రాజు అక్కడి నుంచి వెళ్లే సమయంలో భార్య, కుమార్తె ఉన్నారని, ప్రస్తుతం అతడి భార్య గర్భవతి అని సమాచారం.