Home / SLIDER / తెలంగాణలో ఆదర్శంగా ఆ “ఊరు”

తెలంగాణలో ఆదర్శంగా ఆ “ఊరు”

ఈ ఊరు.. ఆ ఊరు అని లే కుండా ఏ ఊరు చూసినా రోడ్ల మీద ధాన్యం అరబోతలు సర్వ సాధారణమయ్యాయి. ఇది రైతన్నలకు తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కానీ దీని మూలంగా తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇది అందరితో పాటు రైతులనూ ఆవేదనకు గురి చేస్తున్న ఆంశమే. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు అందరిలాగే ఉప్లూర్‌ రైతన్నలకూ ఉన్నాయి. ధాన్యం ఆరబోతలకు సంబంధించిన తిప్పలు ఉప్లూర్‌ గ్రామస్తులకూ తెలుసు. కానీ వారు ఇతర గ్రామాలకు భిన్నంగా..బాధ్యతగా ఆలోచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోయ కూడదని నిర్ణయించుకొని దానిని ఆచరిస్తున్నారు.

ఏకతాటిపై నిర్ణయం..

తమ గ్రామ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదాలో..లేక తరచూ ఏదో ఒక ఊరిలో రోడ్లపై ధాన్యం ఆరబోతల కారణంగా ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న సంఘటనలు వారిని ఆలోచింపజేశాయి. దీంతో తమ గ్రామంలో రోడ్ల పై ధాన్యం ఆరబోయకూడదని గ్రామస్తులు నాలుగేండ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఉప్లూర్‌లో విజయవంతంగా అమలవుతున్నది. ప్రభుత్వం రైతుల అవస్థలను గుర్తించి దశల వారీగా కల్లాల మంజూరు చేపట్టింది. కొందరు రైతులు దీనిని వినియోగించుకుంటుండగా మరి కొందరు తమ స్థోమతను బట్టి సొంతంగా కల్లాలు నిర్మించుకొని తమ గ్రామ తీర్మానానికి కట్టుబడి ఉంటున్నారు.

రోడ్లపై కనిపించని ధాన్యం

ఉప్లూర్‌లో రోడ్లపై ధాన్యం ఆరబోసిన దృశ్యాలు కనిపించ వు. పంట కోతలు కాగానే రైతులు ధాన్యాన్ని తమ వ్యవ సాయ క్షేత్రాల వద్దనే ఏర్పాటు చేసుకున్న సిమెంటు కల్లాల్లో గానీ, భూమిని చక్కగా చదును చేసి ఆరబోతలకు అనుకూలంగా సిద్ధం చేసుకున్న కల్లాల్లో గానీ ఆరబోస్తూ కనిపిస్తారు. గ్రామంలోనికి వచ్చే ప్రధాన రోడ్లపై ఏ సీజన్‌లోనైనా ఆరబోతలు కనిపించవు. ఎంతటి ఇబ్బందుల్లో గానీ వారు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండడం విశేషం. ఫలితంగా ఉప్లూర్‌ గ్రామ పరిధిలో రోడ్లపై ధాన్యం ఆరబోతల ప్రమాదాలు లేవు. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ఉండడం, వరద కాలువ కారణంగా నిండుగా ఉండే చెరువులతో, బోరు బావులకు భూగర్భ జలాలు తగినంతగా అందుతుండడం.. మొదటి నుంచి ఉప్లూర్‌ రైతులు పంటల సాగులో శ్రమిస్తూ ఉండడం లాంటి ఆంశాలు ఉప్లూర్‌ను పంటల దిగుబడిలో ముందుంచుతున్నాయి. భారీగా దిగుబడులు ఉన్నా ఆరబోతలు మాత్రం రోడ్ల మీద చేయరు. దీంతో ఉప్లూర్‌ రోడ్ల పై ధాన్యం ఆరబోతలు లేని గ్రామంగా ఆదర్శంగా నిలుస్తున్నది.