ఏపీ రాష్ట్ర ప్రజలకు మరో ట్రూఅప్ చార్జీల ముప్పు పొంచి ఉంది. రూ.528.71 కోట్ల వసూలుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది. 2014-15 నుంచి 18-19 మధ్య నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాలకు గాను తనకు రూ.528.71 కోట్ల మేర అధిక వ్యయం అయిందని.. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కోర్టు హాలులో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు ఈఆర్‌సీ ప్రకటించింది. అయితే పొరుగు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనో, పట్టణాల్లోనో ప్రజాభిప్రాయం తెలుసుకుంటే.. ప్రజలు నేరుగా తమ సమస్యలను వెల్లడించే అవకాశం ఉంటుందని.. ఇప్పుడు హైదరాబాద్‌కు ఎంత మంది వెళతారని విద్యుత్ రంగ నిపుణులు నిలదీస్తున్నారు.