అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్‌ను కొనలేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కొంతమంది వైసీపీ సభ్యులు పెగాసస్ అంశాన్ని లేవనెత్తారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్,చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మొదలైన వారు ఈ అంశంపై చర్చ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. పెగాసస్ స్పైవేర్‌పై సభ్యుల్లో ఆందోళన ఉందని.. దీనిపై విచారణ జరగాల్సిన అవసరముందన్నారు.
దీంతో పెగాసస్ అంశంపై హౌస్ కమిటీ వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయించారు. స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో శాసనసభ్యులతో కమిటీని వేయనున్నారు. ఆ కమిటీ విచారణ చేపట్టి పెగాసస్ స్పైవేర్‌పై నిజానిజాల నివేదికను అందజేసే అవకాశముంది.