వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని రోజా చెప్పారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి చేస్తామన్నారు. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా డెవలప్ చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా టూరిజంను అభివృద్ధి చేస్తామని రోజా చెప్పారు. గ్రామీణ స్థాయి క్రీడలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని మంత్రి వివరించారు.