ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుపై నిరంజన్ రెడ్డి తోమర్‌తో చర్చించారు.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జోగులంబా గద్వాల్, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులు నష్టపోయారని తోమర్‌కు వివరించారు. ఈ తెగుళ్లను మార్కెట్లో ఉన్న మందులు నియంత్రించలేకపోతున్నాయని, కొత్త మందు కనిపెట్టాలని కేంద్ర మంత్రిని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
దేశంలోనే అత్యధిక స్థాయిలో పామాయిల్ సాగుకు తెలంగాణలో ఆయిల్ ఫామ్ ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని కోరగా.. ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయాలంటే సాధ్యం కాదని, సంస్థ ఏర్పాటును పునః పరిశీలిస్తామని తోమర్ హామీ ఇచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘డ్రిప్ ఇరిగేషన్ స్కీంలో దశల వారీగా కాకుండా ఒకేసారి సబ్సిడీ ఇవ్వాలని కోరడంతో.. కేంద్ర మంత్రి అంగీకరించి వెంటనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని నిరంజన్ పేర్కొన్నారు.