పొత్తులపై జనసేన ముందు మూడు ఆప్షన్లు అంటూ ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీతో ప్రభుత్వాన్ని స్థాపించడం, టీడీపీ+బీజేపీతో కలిసి స్థాపించడం , జనసేన ఒక్కటే స్థాపించడం.. ఇలా మూడు ఆప్షన్ల గురించి ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా 2014, 2019 ఎన్నికల్లో వెనక్కి తగ్గామని.. ఈసారి మాత్రం అలా ఒప్పుకోబోమంటూ పరోక్షంగా సీఎం పదవి జనసేనకే దక్కాలంటూ వ్యాఖ్యానించారు. అప్పటి వరకూ జనసేనకు అనుకూలంగా ఉన్న టీడీపీ నేతలు ఒక్కసారిగా పరోక్షంగా వ్యతిరేక కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో పవన్ చేసిన ఓ ట్వీట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. జరభద్రం అంటూ ఆ ట్వీట్ ప్రారంభంలోనే ఆయన పేర్కొన్నారు. ‘‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి’’ అంటూ జనసైనికులు, అభిమానులకు సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ అన్నది టీడీపీ నేతలకా? వైసీపీ నేతలను ఉద్దేశించా? అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.