కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్‌సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (ఎల్‌జీఎస్ ) ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షల్లో 92వ ర్యాంక్ సాధించారు. 24 ఏళ్ల తన కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్‌డీసీ) ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు.
ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో..
కొడుకు డిగ్రీ పూర్తి చేసుకోగానే తాను కోచింగ్ తీసుకున్న సెంటర్లో తన కుమారుడిని అదే కేంద్రంలో చేర్పించింది. ఇద్దరూ మూడు సార్లు ప్రయత్నించి విఫలమై నాలుగోసారి ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.