ప్రముఖ నటి సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది.
‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. కానీ, నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది.
అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు అర్థమైంది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా.నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్నా సందర్భాలున్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది’’ అని సమంత పేర్కొంది.
సమంత అరుదైన వ్యాధి గురించి బాధపడిన విషయం చెప్పగానే అభిమానులంతా షాక్‌కి గురయ్యారు. ప్రముఖులు సహా అభిమానులంతా సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.