Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 30 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న మల్లారెడ్డికి చెందిన యూనివర్శిటీ క్యాంపస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతలు, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు పెద్ద ఎత్తున వాటాలున్నాయి. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంలో భాగంగానే మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో మరికొందరు కీలక నాయకులను టార్గెట్ చేస్తారని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర సాయుధ బలగాల పహారాాలో సోదాలను చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో పెద్దగా బయటకు తెలియని బిఎల్ సంతోష్‌ను టిఆర్‌ఎస్ పార్టీ టార్గెట్ చేయడంతో కేంద్రం దూకుడుగా స్పందించినట్లు తెలుస్తోంది. సోమవారం సిట్ విచారణకు బిఎల్ సంతోష్ హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణకు ఆయన హాజరు కాలేదు. సంతోష్‌ను అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది.