తెలంగాణలో ఉన్న దివ్యాంగులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు రుణాలను అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివ్యాంగుల గర్వు సే’ సెంటర్ ను మంత్రి కొప్పుల ప్రారంభించారు.
18 సంవత్సరాల నిండి 45 సంవత్సరాల లోపు గల దివ్యాంగులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణలో గుర్తిస్తామని అన్నారు. వారికి గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం దివ్యాంగులకు ప్రభుత్వ సంస్థల ద్వారా ఆర్థిక రుణాలను అందజేస్తామన్నారు. అంతకుముందు మండలం కేంద్రంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.