జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి పోటీ చేసేది అనుమానమే.ఒకవేళ పోటీ చేసినా ఎర్రబెల్లిని ఓడించే పరిస్థితి లేదు…ఇక ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హ్యాట్రిక్ కొట్టిన ఎర్రబెల్లి మరోసారి గ్రాండ్ విక్టరీ సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు పాలకుర్తి కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కత్తుల సోమిరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి, ఆకుల పృథ్వీ కూడా పార్టీలో చేరారు. వీరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఈ చేరిక జరిగింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితలై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ఈ సందర్భంగా కత్తుల సోమిరెడ్డి తెలిపారు. తమ ప్రాంతంలో ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించేందుకు తన వంతుగా కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. మొత్తంగా పాలకుర్తి నియోజకవర్గంలో కీలక నేతలు కారెక్కడంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది.