ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్ ఇండియాలో బిజీ ఆర్టిస్ట్ గా మారిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు డ్రగ్స్ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్ఐఏ అధికారుల నోటీసులు జారీ చేయడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
తాజాగా వరలక్ష్మి దగ్గర చాలా ఏళ్లుగా పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్లు కొచ్చి పోలీసుల విచారణలో తేలింది. ఆదిలింగంకు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయి. దీంతో ఆదిలింగంను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో అదిలింగంనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సినీ నటి వరలక్ష్మిని విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సమన్లు జారీచేశారు.
వరలక్ష్మికి పీఏగా పనిచేసిన అదిలింగం గతంలో అనేకసార్లు ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మిన ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ఆదిలింగంకు వరలక్ష్మీ సహకరించారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కోలీవుడ్‌లో ఎవరెవరితో ఆదిలింగం టచ్‌లో ఉన్నారో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. ఇలా ఆయనకు సంబంధించిన అనేక విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టడం కోసమే వరలక్ష్మి శరత్ కుమార్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఎన్ఐఏ నోటీసులతో కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌కు సంబంధించి ఎవరైనా ఈ డ్రగ్స్ గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నారేమోననే కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. కాగా గతంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్నారంటూ పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లను తెలంగాణ పోలీసులు విచారించి…వారి బ్లడ్, హెయిర్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. కానీ సినీ పెద్దలు, రాజకీయ వత్తిళ్లతో ఆ కేసు క్రమంగా మూలనపడింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో అని సౌత్ ఇండియా సినీ స్టార్ట్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.