ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తనపై అమరేగౌడ అనుచరుడు సంగనగౌడ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ గత నెల కొప్పల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.. న్యాయం చేయాలని కోరిన బాధిత కుటుంబసభ్యులతో అమరేగౌడ ‘ఒక్కడే మహిళను రేప్ ఎలా చేస్తాడు? రేప్ చేయాలంటే కనీసం ముగ్గురు లేదా నలుగురైనా ఉండాలి. ఒక్క చేతితో చప్పట్లు మోగవు కదా!’ అంటూ వికృతంగా మాట్లాడారు.