తెలంగాణ సాధనకోసం ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమేనని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారందరిని గుర్తు పెట్టుకున్నారని, సమయం వచ్చినప్పుడు సముచిత స్థానం కల్పిస్తారన్నారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రజలందరి భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారన్నారు.అలాగే మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, అక్బర్ హుస్సేన్, కృష్ణమోహన్ రావు, పొనుగంటి మల్లయ్య, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.