పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగాడు.
దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కొండంత లక్ష్య ఛేదనలో కనీసం ప్రయత్నించకుండానే పరాజయాన్ని ఆహ్వానించింది సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ . 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టును ముందుండి నడిపిస్తాడనుకున్న కేన్ విలియమ్సన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. పది కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసుకున్న నికోలస్ పూరన్ (0) సున్నా చుట్టాడు.
మార్క్మ్ (41 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ మరీ స్లోగా బౌలింగ్ చేసింది. 61 రన్స్ తేడాతో ఓడిన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు మరో పెద్ద జలక్ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటుకు 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. తొలిసారి ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తప్పు చేసిందని, ఐపీఎల్ నియమావళి ప్రకారం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌పై 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.