Breaking News
Home / ANDHRAPRADESH / అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిబద్ధుడయ్యారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ వ్యవస్థల ప్రక్షాళనకు నడుం బిగించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజావేదిక నుంచే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతోపాటు కృష్ణా నది కరకట్ట మీద అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంసిద్ధమయ్యారు. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే బృహత్తర పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తొలి నెలరోజుల పాలనలో తనదైన ముద్రవేశారు. జగన్‌ నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మేనిఫెస్టోనే దిక్సూచిగా పాలన 
ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, తొలి మంత్రివర్గ సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల్లోని అంశాలను ఫొటో ఫ్రేములు కట్టించి మరీ తన కార్యాలయంలో గోడలకు అలంకరించారు. మంత్రులూ అదే విధంగా చేయాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుకు కట్టుబడ్డారు.

సామాజిక విప్లవం
రాజకీయ, పాలనా వ్యవస్థలో సీఎం జగన్‌ సామాజిక విప్లవం తీసుకొచ్చారు. తమ ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తామన్నారు. మంత్రివర్గంలో 50 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించి తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఆ వర్గాలకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్‌ను చేశారు.

రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అందరి మన్ననలు పొందారు. టీడీపీ నుంచి ఆరేడుగురు ఎమ్మెల్యేలను లాగేసి, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేద్దామని తనకు కొందరు సూచించినా ససేమిరా అన్నారు. చంద్రబాబు చేసినట్లు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నదే తన విధానమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని జగన్‌ విన్నవించడం గమనార్హం. ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తన మంత్రివర్గంలో మంత్రులు డమ్మీలు కారని, వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చెప్పారు.

అవినీతి అంతానికి పంతం
అవినీతి రహిత పాలన అందించేందుకు వైఎస్‌ జగన్‌ కార్యాచరణకు ఉపక్రమించారు. అదే విషయాన్ని ఇటు మంత్రివర్గ సహచరులకు, అటు అధికార యంత్రాంగానికి తేల్చిచెప్పారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని… రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పటిష్ట పరచాలని సూచించారు.

ఉరకలెత్తిస్తున్న సీఎం
ప్రజలకు నీతివంతమైన పాలన అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సత్వరం, సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో ఆయన వేగానికి నిదర్శనం. మంత్రివర్గ ఏర్పాటుకు ముందే అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశారు. తన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం వివిధ అంశాలపై సమీక్షలు జరుపుతూ పరిపాలనను గాడిలో పెడుతున్నారు.

నెల రోజుల పాలనలో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు
రైతన్నలకు వెన్నుదన్నుగా..
– రబీ సీజన్‌ నుంచే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు
– పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం.
– రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లింపు
– పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి
– కౌలు రైతులకు గుర్తింపు కార్డులు
– వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసి రైతులకు దిశానిర్దేశం చేసేందుకు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు

మనసున్న నేతగా తొలి సంతకం
– మనసున్న పాలకుడినని సీఎం వైఎస్‌ జగన్‌ తొలి సంతకంతోనే నిరూపించుకున్నారు
– సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు
– పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్‌ను రూ.2,250కు పెంపు
– వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
– దాంతో కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం
– డయాలసిస్‌ చేయించుకుంటున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నెలకు రూ.3,500 నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంపు
– ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి
– అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం
– పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.18 వేలకు పెంపు
– హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు

ఇక గ్రామ స్వరాజ్యం
– ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌
– దాంతో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
– అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు
– ప్రతి గ్రామ పంచాయతీలో పది మంది ఉద్యోగుల నియామకం
– మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు

జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’
– ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌
– అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు
– తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
– మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు
– అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు
– వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ
– ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ
– వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు

అపర భగీరథుడిలా…
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం స్ఫూర్తితో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెకును సందర్శించి వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. నీటిపారుదల రంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించారు. కాగా, రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేలా వైఎస్‌ జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి పనిచేయాలని నిర్ణయించడం పట్ల జాతీయస్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక హోదానే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో సీఎం వైఎస్‌ జగన్‌ సత్సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఢిల్లీకి వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటించాలని అభ్యర్థించారు. విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా వాదించారు. ఓవైపు హోదా కోసం పోరాడుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

విభజన సమస్యల పరిష్కారానికి చొరవ
అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ దిశగా చర్చలను వేగవంతం చేశారు. నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐదుసార్లు కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టీడీపీ దోపిడీపై విచారణ
ప్రాజెక్టుల కాంట్రాక్టులను పారద్శకంగా కేటాయించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ప్రాజెక్టుల టెండర్లలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చేందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు దోపిడీపై విచారణకు ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్తు కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడి రూ.2,636 కోట్లు కొల్లగొట్టారని తేల్చారు. అందుకు బాధ్యులైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇతర అధికారులపై చట్ట ప్రకారం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. @Sakshi