Home / EDITORIAL / మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్‌ కొత్త భూమిక!

మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్‌ కొత్త భూమిక!

ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడటం రాబోయే రోజుల్లో జరిగే మార్పును సూచిస్తున్నది.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాట్లాడినంత స్పష్టంగా దేశంలో ఏ ముఖ్యమంత్రీ మాట్లాడి ఉండడు. పౌరసత్వ చట్టం తీసుకురావడమనేదే వందకు వంద శాతం ఒక తప్పుడు నిర్ణయమని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తీరతామని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్పష్టం చేశానని ఆయన చెప్పారు. తాము ఏది చేసినా ఒక నిశ్చయ చిత్తంతో చేస్తామని, విధానపరంగా, నిండుమనసుతో వ్యతిరేకిస్తాము కాని సగం సగం మనసుతో చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంపై భారత రాజ్యాంగ పీఠికలో ఏమి రాశారో ఆయన చదివి మరీ వినిపించారు. సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

కేసీఆర్ మాట్లాడినట్లుగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ వంటి నేతలు మాట్లాడి ఉంటే ఇవాళ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచి ఉండేదనడంలో సందేహం లేదు. పార్టీ అధ్యక్ష పదవిలో లేకపోయినా పౌరసత్వ చట్టంపై ఇవాళ దేశమంతటా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలిగా తిరుగుతూ వివిధ సభల్లో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పౌరసత్వ చట్టం గురించి మాట్లాడేందుకు లభించే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

నెలరోజుల క్రితం రాజకీయాలకు అతీతమైన రామకృష్ణ మిషన్ బేలూర్ మఠ్‌లో మాట్లాడినా, మంగళవారం ఎన్‌సిసి కేడెట్లను ఉద్దేశించి మాట్లాడినా ఆయన పౌరసత్వ చట్టాన్ని సమర్థించుకోవడమే ప్రధానమైంది. అయినప్పటికీ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు ఏడువారాలుగా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగడం, మీడియాలోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, వివిధ వేదికల్లోనూ పౌరసత్వ చట్టం గురించే చర్చలు సాగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం ఎప్పుడైనా తనను తాను సమర్థించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నదంటే ప్రజల నుంచి వ్యతిరేకత సెగ తాకుతున్నదనే అర్థం. లేకపోతే చట్టం ప్రవేశపెట్టిన 40 రోజుల తర్వాత కూడా మోదీ, అమిత్ షాలు అప్రయత్నంగా పెదవి విప్పినా పౌరసత్వ చట్టం గురించి మాట్లాడి ఉండే వారు కాదు.

అందరూ ఊహించినట్లే దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని ఎన్నికల ప్రధాన అంశంగా మార్చడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర యత్నం చేస్తున్నది. పౌరసత్వ చట్టం గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర నేతలు కానీ ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మాట్లాడకపోయినా బీజేపీ నేతలే వారిని ఆ అంశంపై చర్చకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో జరిగిన అభివృద్దిని చెప్పుకోవడానికి బదులు పౌరసత్వ చట్టం, రామజన్మభూమి వివాదం, త్రిపుల్ తలాఖ్, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు గురించి బీజేపీ నేతలు అధికంగా మాట్లాడుతున్నారు.

కాని ఢిల్లీ ప్రజలు మాత్రం ఎందుకో ఈ అంశాలపై పెద్దగా దృష్టి సారిస్తున్నట్లు కనపడడం లేదు. ఢిల్లీ ఎన్నికల్లో హిందూ, ముస్లింల ప్రాతిపదికగా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నదా అని ఒక పనిమనిషిని అని అడిగితే ‘ఆ రకంగా జరిగే అవకాశాలు లేవు సార్, మేమంతా కలిసిమెలిసే ఉంటాం. మా ఏరియాలో కటింగ్ చేసేవాడు, పేపర్లు అమ్మేవాడు, సైకిల్‌కు పంచర్ కొట్టేవాడు అందరూ ముస్లింలే. ఒకరు లేకపోతే మరొకరు లేరు. కశ్మీర్ అంటే మన భూభాగం అన్న ప్రేమ ఉంది సార్. అంత మాత్రాన మన మధ్య జీవిస్తున్న ముస్లింలను ఎలా వ్యతిరేకిస్తాం’ అని చెప్పింది. ‘అయినా కేజ్రీవాల్ మాకేం తక్కువ చేశారు.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అద్భుతమైన పాఠశాలలు, బస్సెక్కితే ఉచితంగా ప్రయాణించేందుకు గులాబీ రంగు టికెట్, మొహల్లా వైద్యశాలలు.. ఇవన్నీ బీజేపీ వస్తే ఉంటాయని గ్యారంటీ ఏమిటి’ అని నిరుపేద మహిళలు అడుగుతున్నారు.

ఢిల్లీలో ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయానికీ కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయానికీ పెద్ద తేడా లేదు. దేశ భక్తి, దైవభక్తి, జాతీయవాదం, మతతత్వం వీటన్నింటికీ వేర్వేరు నిర్వచనాలున్నాయి. ఈ నాలుగింటినీ కలగలిపి అన్నీ ఒకటేనని చెప్పుకుని ప్రజల్లో ప్రయోజనం పొందాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తే అది దీర్ఘకాలంలో విజయం సాధించడం కష్టం. ప్రజల్లో ఉన్న దైవభక్తి రాజకీయాలకు అతీతమైందనడంలో సందేహం లేదు.

భారతీయ జనతా పార్టీ ఉనికిలో ఉన్నా లేకపోయినా ఈ దేశంలో కోట్లాది ప్రజలు రకరకాల మత విశ్వాసాలతో వివిధ మందిరాలకూ, మఠాలకూ వెళతారని, రకరకాల ఆచారాలు పాటిస్తారని అందరికీ తెలిసిందే. బిజెపి ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలకో, దేవుళ్ల పెళ్లిళ్లకో, జాతర్లకో వెళుతూనే ఉంటారు. వీటన్నింటికీ ఈ దేశ రాజకీయాలతో నిమిత్తం లేదు. ప్రభుత్వం మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ భవన్‌లో అడుగుపెడితే ఒకవైపు బాలాజీ మందిర్, మరో వైపు కనక దుర్గ మందిరం, వెనుక వైపు మసీదు కనపడతాయి.

ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో అనేక చోట్ల ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మూలంగా దేశంలో దైవభక్తులు పెరిగిపోతారని, వారు దేశ భక్తులుగా, జాతీయ వాదులుగా మారిపోతారని, ఆ తర్వాత వారు ఇతర మతాలను వ్యతిరేకిస్తారని, ఆ తర్వాత దేశంలో హిందువులంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని ఎవరైనా సిద్ధాంతీకరిస్తే వారి ఆలోచనా విధానంలోనే లోపం ఉన్నదని చెప్పవచ్చు. ఈ సిద్ధాంతం తప్పని నిరూపిస్తున్న నేత కేసీఆర్. ఎందుకంటే ఆయనలో చాలా మంది బీజేపీ నేతల్లో లేని దైవ భక్తి ఉన్నది. ఆయన బాహాటంగా దేవాలయాలకు వెళ్లడం, మఠాధిపతులను సందర్శించడం, పూజలు, యజ్ఞాలు చేయడం కొనసాగిస్తూనే ఉంటారు. తెలంగాణలో బీజేపీ ఓటర్లను సైతం అయోమయపరచగలిగిన శక్తి ఆయనకున్నది.

అలా చేసినా సరే తెలంగాణలో ముస్లింలు ఆయనను వ్యతిరేకించడం లేదు. ఆయన హిందువు అయినంత మాత్రాన ముస్లింల వ్యతిరేకి కాదని వారికి తెలుసు. ‘‘ముస్లింలు మన ప్రజలు కాదా? ఎందుకు వివక్ష చూపాలి? మనం కలిసికట్టుగా ఎందుకు జీవించకూడదు?’’ అని ఆయన వేసిన ప్రశ్న ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. అంతేకాదు, బీజేపీ జాతీయవాదంపై దావోస్‌లో పెట్టుబడిదారుల మధ్య చర్చ, విదేశాల్లో భారత దేశ ప్రతిష్ఠ వంటి అంతర్జాతీయ అంశాలను ఆయన స్పృశించారు.

నిజానికి భారత దేశ రాజకీయాల్లో జాతీయ వాదాన్నీ, హిందూత్వ వాదాన్నీ కలగలిపి ప్రయోజనం పొందాలన్న ఆలోచన కొత్త కాదు. స్వాతంత్ర్య పూర్వం కాంగ్రెస్‌లోనే ఈ శక్తులు తలెత్తినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఆడ్వాణీ రథయాత్ర భావోద్వేగాలను రేకెత్తించింది కాని బాబ్రీ మసీదు కూల్చి వేత తర్వాత నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలను రద్దు చేసి ఎన్నికలు జరిపిస్తే మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. నరేంద్ర మోదీకి 2014 లోనూ, 2019 లోనూ వచ్చిన ఓట్లు పూర్తిగా హిందూత్వ వాదం ఆధారంగా వచ్చిన ఓట్లు కావు.

యుపిఏ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత, అవినీతి, ఒక బలమైన నాయకుడు కనపడడం, ప్రతిపక్షం నిర్వీర్యం కావడం వల్ల వచ్చిన ఓట్లు. కనుక రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా హిందూత్వ ఎజెండాను అమలు చేసి, ప్రభుత్వం ఇతర అంశాల్లో పనితీరు కనబరచకపోయినా ప్రజలను విడగొట్టడం ద్వారా ఓట్లు సాధించగలమని బీజేపీ నేతలు భావిస్తే మరోసారి వారు తమ ఆలోచనను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రసాయనిక ప్రయోగమైనా, అన్ని రసాయనాలు సమపాళ్లలో ఉపయోగిస్తేనే విజయం సాధిస్తుంది. ఏ రసాయనాన్ని మోతాదు మించి ప్రయోగించినా అది వికటించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోదీ, అమిత్ షాలను చూస్తేనే ప్రజలకు వారేమి మాట్లాడతారో తెలిసిపోతే వారనుకున్న ప్రయోజనం నెరవేరలేదనేదే లెక్క.

అయితే దేశంలో ప్రజలకు ఎదురవుతున్న అత్యంత కీలకమైన ప్రశ్న- ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది. మోదీ, అమిత్ షాలు భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ, నిరుద్యోగం పెరిగిపోవడమే తప్ప తగ్గే అవకాశాలు లేవని, వారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని, రైతాంగ సమస్యలు తీవ్రతరమవుతున్నాయని తెలిసినా బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు రాబోయే రోజుల్లో జరిగే మార్పును సూచిస్తున్నాయని చెప్పక తప్పదు. తాను ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆయన జాతీయ స్థాయిలో మరో సారి భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారని సూచిస్తోంది. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీని ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా అడ్డుకుంటున్నాయి. జార్ఖండ్, మహారాష్ట్రలలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఢీకొన్నాయి. హర్యానాలో ప్రాంతీయ పార్టీతో చేతులు కలిపి బిజెపి అధికారం ఏర్పాటు చేయగలిగింది. పంజాబ్‌లో అకాలీదళ్ లేకుండా బీజేపీ స్వంతంగా ఎన్నికల్లో పోటీ చేయగలిగే ప్రసక్తి లేదు.

బిహార్‌లో జేడి(యు) లేకుండా బీజేపీ తనంతట తాను అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఢీకొనడం బీజేపీకి తలకుమించిన పనిగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారంలోకి రావడం బీజేపీకి అంత సులభం కాదు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని ఢీకొనడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఒడిషాలో బిజూ జనతాదళ్‌ను గద్దెదించడం బీజేపీకి సాధ్యమయ్యే పని కాదు. ఇక దక్షిణాదిన కర్ణాటకలో తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి ఇంకా ప్రశ్నార్థకమైన స్థాయిలో ఉన్నది.

కనుక ఉత్తరాదిలోనూ, కర్ణాటకలోనూ కాంగ్రెస్ పుంజుకున్నా, పుంజుకోకపోయినా మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, కుల వర్గ జాతి సమీకరణాలకు అతీతంగా భావోద్వేగాలను వ్యాప్తి చేసి విజయం సాధించడం ఏ విధంగా సాధ్యమవుతుందో బీజేపీ అగ్రనేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014, 2019లో ఉన్న సానుకూల వాతావరణం తర్వాతి సంవత్సరాల్లో ఉంటుందనే నమ్మకం కానీ, మోదీ ఆకర్షణ బలహీనపడదన్న గ్యారంటీ కానీ ఏమీ లేదు.

2014కు ముందు వాతావరణం కల్పించి, దేశంలో అభివృద్ధి, అవినీతి నిర్మూలన, యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించడం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం, సుపరిపాలన అందించడం తన వల్లే సాధ్యమవుతుందని మరో సారి మోదీ నిరూపించుకోగలిగినప్పుడే బీజేపీ తన గెలుపును సుస్థిరం చేసుకోగలుగుతుంది. కేసీఆర్ మాటలను కొంతమంది సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక భూమికను ప్రస్తావిస్తున్నారని, ఆయన తెలంగాణలో అనుసరిస్తున్న ఫార్ములా దేశానికి అనుసరణీయం కాగలదని భావించడానికి వారు సిద్ధంగా లేరు. కానీ కేసీఆర్ ప్రతి సారీ ఒక విజయం తర్వాతే విశ్వాసంతో మాట్లాడుతున్నారని గ్రహించాలి. బహుశా 2019లో కంటే రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నదని ఆయన భావిస్తున్నారేమో.

ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat