కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు.
చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తి సంతోశ్ కుమార్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరగని సైనికుడిగా పనిచేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ. చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ… చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా అందరితో గౌరవంగా మెలుగుతారు.
see also :సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయిన్ పల్లి మండలం కొదురుపాక గ్రామంలో 1976 డిసెంబర్ 7న సంతోష్ కుమార్ జన్మించారు. తండ్రి రవీందర్ రావు. తల్లి శశికళ. ఆయన ఉన్నత విద్యాభ్యాసమంతా హైదరాబాదులో పూర్తయింది. పుణె యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందునుంచే పార్టీ ఏర్పాటు సన్నాహాలు, జెండా, ఎజెండాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
మృదుస్వభావి, మితభాషి అయిన సంతోష్ కుమార్ ఉద్యమ కాలంలో అధినేత తనకు అప్పగించిన బాధ్యతలను ఎక్కడా తేడా రాకుండా విజయవంతంగా పూర్తి చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో అందరినీ ఏకతాటిపైకి తేవడంలో తనవంతు పాత్ర పోషించారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయల్దేరుతున్న సమయంలో ఆనాటి పాలకులు ఆయన్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలోనూ సంతోష్ కుమార్ చిన్న తొట్రుపాటుకు కూడా అవకాశం ఇవ్వలేదు.
see also :రాజ్యసభ సభ్యత్వానికి.. సంతోష్ కచ్చితంగా అర్హుడే!
అలుగునూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలుకు.. ఆపై నిమ్స్ కు తరలించే వరకు అధినేత వెన్నంటే ఉన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 11 రోజుల పాటు అధినాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయడం… వచ్చిన ప్రకటన వెనక్కి వెళ్లడం.. తదనంతర పరిణామాలతో ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటిలోనూ సంతోష్ కుమార్ చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా దాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బహిరంగ సభలు, రాస్తారోకోలు, రైలో రోకోలు మొదలుకొని.. పలు ఉపఎన్నికల దాకా.. ఏ కార్యక్రమైనా, ఏ ఎలక్షనైనా కేడర్ నూ, లీడర్లనూ సమాయత్తం చేసి, సమన్వయం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది! ఒక క్రమశిక్షణగల సైనికుడిలా సంతోష్ కుమార్ కేసీఆర్ వెంట 18 ఏళ్లుగా నడుస్తున్నారు!
తెరముందు కనపడకపోయినా.. అధినేత వ్యూహాలను, సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలో సంతోష్ కుమార్ ది భిన్నమైన శైలి. అధినేత వ్యక్తిగత విషయాలతో పాటు, పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా, అందరికీ తలలో నాలుకలా మెదిలే వ్యక్తి. పార్టీ విషయాలైతే కేడర్‌నీ.. ప్రభుత్వ కార్యక్రమాలైతే ప్రజలనూ కలుపుకుని ముందుకువెళ్లడంలో సంతోష్ కుమార్ తీసుకునే చొరవే వేరు. ఆయనకున్న సహనం, ఓపిక చూసి పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతాయి. సమస్య ఎంత క్లిష్టమైనా సరే ఓపిగ్గా పరిష్కరించి, వినయంగా నిలబడే నిండైన వ్యక్తి సంతోష్ కుమార్. రోజులో 16 నుంచి 18 గంటలు అలిసిపోకుండా పనిచేసి, వివాదరహితుడుగా పార్టీలో తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. పార్టీలో సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. అర్ధరాత్రి అపరాత్రి అని తేడాలేకుండా వాళ్ల యోగక్షేమాలు చూసే వ్యక్తి సంతోష్ కుమార్.
see also :రేవంత్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
ఉద్యమ నేత కేసీఆర్ సూచనల మేరకు ఉద్యమానికి దివిటీగా నిలిచి, తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన టీ-న్యూస్ కు ఎండీగా సంతోష్ కుమార్ గురుతర బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. చానల్ సిబ్బందిని తన సొంత మనుషులుగా భావించి ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తారు. ఇటు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పార్టీకి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు విజయంతంగా అమలు చేయించడంలోనూ సంతోష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేశారు. ప్రజాహితం కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. సామాజిక సేవలోనూ నేను సైతం అని ముందుకొచ్చారు.
ఇంతకాలం నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేసిన సంతోష్ కుమార్ ఇక ప్రజానాయకుడిగా పెద్దలసభలో అడుగుపెట్టబోతున్నారు. ఏ పదవీ ఆశించకుండా అహోరాత్రులు టీఆర్ఎస్ పార్టీకి సేవ చేసిన సంతోష్‌కుమార్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం సముచిత గౌరవమే అని పార్టీ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు.
పేరు: జోగినిపల్లి సంతోష్‌కుమార్
తండ్రి: జోగినిపల్లి రవీందర్‌రావు
తల్లి: జోగినిపల్లి శశికళ
భార్య: జోగనిపల్లి రోహిణి
పిల్లలు: ఇద్దరు ( ఇషాన్, శ్రేయాన్)
పుట్టిన తేది: 21-7-1975
వయస్సు: 43 సంవత్సరాలు
చదువు: ఎంబీఏ (మాస్టర్ ఇన్ పర్సనల్, మేనేజ్‌మెంట్ )పూనే
ప్రాథమిక విద్య: 10వ తరగతి వరకు స్వగ్రామం కొదురుపాకలో
ఇంటర్, డిగ్రీ : కరీంనగర్ జిల్లాకేంద్రంలో
ఊరు: కొదురుపాక, బోయినపల్లి మండలం, రాజన్నసిరిసిల్ల జిల్లా
పదవులు: ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.