తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి.ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలం క్రితం వరకు రాజకీయాలను శాసించిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు మరియు మాజీ ఎంపీపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరడానికి సిద్దమయ్యారు.
అందులో భాగంగానే ఆ ముగ్గురు నాయకులు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన నల్ల మనోహర్‌రెడ్డి, రుద్ర ఓంప్రకాశ్, నల్లబెల్లి మండలానికి చెందిన పీసీసీ సభ్యుడు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ లు నర్సంపేట నియోజకర్గ ఇంచార్జ్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో సోమవారం రాత్రి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే వారు త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం.