ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు తయారైందని రాజకీయవర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే…నేనంటే నేను సీఎం అభ్యర్థిని అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న తీరుతో జనాలు నవ్వుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, ఆ మాటను ఎవరైనా కాదంటే ప్రజలు అంగీకరించబోరని ప్రతిపక్ష నేత కె జానారెడ్డి చెప్పారు. అయితే టీమ్ లీడర్ సెంచరీ చేసినా మ్యాచ్ ఓడిపోయిన పరిస్థితులూ ఉన్నాయన్నారు. తద్వారా టీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోబోతుందని పరోక్షంగా చెప్పేశారు అని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి .
హైదరాబాద్‌లోని తన నివాసంలో జానారెడ్డి ఇష్టాగోష్టిగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనని చెప్పుకున్నారు. అయితే ఎన్నికలకు ఆరునెలల ముందు తెలంగాణ ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పక్క ప్రణాళిక రూపొందించిందన్నారు. తనకూ సీఎం అర్హతలున్నాయని పేర్కొంటూ లేవని అంటే ప్రజలు ఒప్పుకోరని ఆయన వ్యాఖ్యానించారు. తన కొడుకు ఎక్కడినుంచి పోటీచేయాలని నిర్ణయించేది కేవలం అధిష్టానం మాత్రమేనన్నారు. ఎన్నికలకు ముందే టికెట్లు ప్రకటించడం సరైంది కాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు ఈ సందర్భంగా జానారెడ్డి పంచ్ వేశారు.