తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం కుర్చీ గురించి పగటి కలలు కంటూ ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
130 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నడో కుటుంబ పార్టీగా మారిందని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కేసీఆర్ పాలన కుటుంబ పాలన అంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇంట్లో ఆయన భార్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని.. కోమటిరెడ్డి సోదరుల్లో ఇద్దరికి పదవులున్నాయని.. గతంలోనూ మరో సోదరుడు ఎమ్మెల్సీ కోసం పోటీ పడి ఓడి పోయారు..
సీఎల్పీ నేత జానా రెడ్డి కొడుకు పార్టీ వేదికల పై తిరుగుతున్నారని.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తండ్రీ కొడుకుల ఫోటోలు పదేళ్ల నుంచి ఫ్లెక్సీల పై కనిపిస్తున్నాయని.. కాంగ్రెస్ నేతలందరివీ కుటుంబ రాజకీయాలే అన్నారు. కండ్లు ఉండి కూడా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ ఆంధ్రా పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యం అని అన్నారు.