విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారా..? అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే రైతుల భూములను కాజేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకున్న నేతలు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జన్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేతల భూ దాహం పరాకాష్టకు చేరడమే ఇందుకు నిదర్శనమని రైతులు వాపోతున్నారు.
అధికార పార్టీ నేతల కళ్లుపడితే భూ దోపిడీకి అంతే లేదన్న చందంగా మారింది విశాఖ జిల్లాలో టీడీపీ నేతల భూ ఆక్రమణ. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం రాంపురం పంచాయతీ పరిధిలోని సర్వే నెం.127, 132, 157లలో ఉన్న గెడ్డవాగు భూములను కాజేసేందుకు స్థానిక టీడీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఐదారు తరాల కుటుంబాలు ఈ ప్రాంతంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఆఖరకు రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ భూములన్నీ వీరిపేరు మీదనే ఉన్నాయి. ఇటీవల వేల రూపాయలు ఖర్చు చేసి వేప, సరుగుడు, యూకలెప్టస్, తాటి, కొబ్బరి చెట్లను కూడా నాటారు. ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత నెల 31న రెవెన్యూ అధికారులు ప్రొక్లైనర్‌లతో వచ్చి చెట్లను నరికేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రైతులు రెవెన్యూ అధికారులను నిలదీస్తే ఇక్కడి సాగు భూముల్లో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద పేదలకు ఇళ్లతోపాటు దోబీఘాట్ నిర్మిస్తున్నామంటూ టీడీపీ నేతలు తమపై దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ పేరుతో ఉన్న భూములను పరిహారం చెల్లించకుండా పోలీసులను అడ్డుకుపెట్టుకుని కేసులు పెట్టిస్తామంటూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, గెడ్డవాగును ఆనుకుని సాగు చేస్తున్న సుమారు 50 మంది రైతుల భూములే ప్రభుత్వానికి ఎందుకు కావాల్సి వచ్చిందని ఆరా తీస్తే పంచాయతీలో మాజీ సర్పంచ్ రెడ్డి నారాయణ రావు, ఆయన భార్య ఎంపీటీసీ రెడ్డి వరలక్ష్మీ అక్రమ అవినీతిని రైతులు నిలదీస్తున్నారని, అందుకు ప్రతీకారంగానే ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ దారుణానికి ఒడి గట్టారని చెబుతున్నారు.
పేదలకు ఇళ్లు కట్టించే పేరుతో భూమిని కాజేస్తున్న అధికార పార్టీ పెద్దలు, వారికి అనుకూలంగా ఉండే ధనిక వర్గానికి చెందిన వారికే ఇళ్లు కేటాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాంపురం పంచాయతీలో జరుగుతున్న అవినీతి, భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.