పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా మారాయని, ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహాకూటమి ముసుగులో పొంచిఉన్న అభ్యర్థులకు ఓటేస్తే మళ్లీ మనపై ఆంధ్రా పెత్తనం మొదలవుతుందని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నిజామాబాద్ నగరంలోని 44వ డివిజన్‌లో, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండలంలో, జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో అలంపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం ప్రచారం చేశారు.
కురవి మండలం బలపాల గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతుగా తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లో టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. రసమయికి మద్దతుగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామం నుంచి అల్గునూర్‌లోని పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ తీశారు. రామడుగు మండలం దేశ్‌రాజ్‌పల్లిలో టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో టీఆర్‌ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, సంగారెడ్డి పట్టణంలో టీఆర్‌ఎస్ సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో బోధన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి మైనార్టీలతో సమావేశమయ్యారు. మంచిర్యాల పట్టణం, దండేపల్లిలో మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, రామకృష్ణాపూర్‌లోని ఏ జోన్‌లో చెన్నూర్ అభ్యర్థి బాల్క సుమన్, జన్నారం మండలంలో ఖానాపూర్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్ ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో భౌరంపేటలో ప్రచారం చేశారు.