సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనూ పవన్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీని టీడీపీతో కలపాలని తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని, కానీ తాను తిరస్కరించానని జనసేనాని పలుమార్లు వెల్లడించారు.
తాను కోరుకుంటే సినిమాల్లో కోట్లు సంపాదించగలనని, వాటిని వదిలి పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని, తాను మద్దతిస్తానని చెబితే ఏ పార్టీ అయినా తనకు పదవులు ఇస్తుందనేది పవన్ వాదన.. కానీ పవన్ ప్యాకేజీ తీసుకుని ప్రచారం చేస్తున్నారనేది మరోవాదన.. ఈ క్రమంలోనే తాజాగా, టీడీపీ, జనసేన పొత్తుపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు పొత్తు విషయంలో ప్రజల్లో గందరగోళం కనిపిస్తే తన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన పవన్ మళ్లీ తీవ్రంగానే స్పందించారు. అసలు టీడీపీతో పొత్తు ఊసే లేదని తేల్చి చెప్పారు. జనసేన.. టీడీపీతో కలవదన్నారు. వదిలేసిన, మాకు వద్దనుకున్న రాజ్యసభ సీటును టీజీ వెంకటేష్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
అంటే చంద్రబాబు కూడా జనసేనానికి అమిత్ షా దారిలోనే రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని అర్థమవుతోంది. దీనిపై ఇద్దరికీ మధ్య చర్చలు జరిగాయని స్పష్టమవుతోంది. అప్పుడు రాజ్యసభకు ముగ్గుర్ని నామినేట్ చేసే అవకాశం రాగా, సుజనా చౌదరికి రెండోసారి పొడిగించారు. మిత్రపక్షమైన బీజేపీకి రెండోసీటు ఇచ్చారు. సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్లారు. మూడో సీటును టీజీ వెంకటేష్‌కు ఇచ్చారు. ఆ సమయంలోనే పవన్ కు చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అయితే ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం వైసీపీ విషయంలోను పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెరాస ద్వారా పొత్తు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం నేతల మాదిరిగా ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైసీపీ, తెరాస మధ్య దోస్తీ ఉందని పొత్తులు మాత్రం ఉండవని తేల్చి చెప్పింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వ్యతిరేక పార్టీలను కార్నర్ చేస్తున్నారనేది స్పష్టమైంది. అలాగే మేడా జగన్ ని కలిసేందుకు సిద్ధమైతేనే పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీడీపీ రావెల కిశోర్ జనసేనలో చేరి ఇంత కాలం అవుతున్నా కనీసం కిమ్మనలేదు. కారణం ఆ రెండు పార్టీలూ ఒకటే అని అర్ధమా.. మరి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదా అంటే కచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు దారుణంగా చంద్రబాబును తిట్టిన పవన్ కళ్యాణ్ 2014లో చంద్రబాబే సమర్ధుడంటూ ఊరూరా ప్రచారం చేసారు. కాబట్టి పవన్ నిలకడలేని స్వభావి కాబట్టి కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు పొత్తుతో పోటీకి దిగుతాయనేది సుస్పష్టమవుతోంది.