ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం కృష్ణ జిల్లా, ముదనేపల్లి మండలం వడాలి గ్రామం.
కారణం ఇదేనా..
ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూర్య అనే వ్యక్తిని ఆరునెలలుగా ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, అతనితో పరిచయమయ్యాకే సీరియల్స్ మానేసి ఝాన్సీ నటనకు దూరమైందన్నారు. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్ అవకాశాలు కోల్పోయి.. మరోవైపు సూర్య మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఇక ఝాన్సీ సూర్యతో సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది.
