పార్లమెంట్ లో బుధవారం జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి చేత తక్షణమే సమగ్ర ప్రకటన చేయించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓo బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ దుర్ఘటన పై చర్చించేందుకు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎంపీ నామ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఘటన పై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు పార్లమెంట్ ముందుoచాలని ఆల్ పార్టీ మీటింగ్ లో స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. దాడులు జరిగే అవకాశం ఉందని గత కొంతకాలంగా పేపర్లలో వార్తలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంట్ బయట ఉగ్ర దాడి, జరిగి, పలువురు చనిపోయారని అన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ లోపలే ఘటన చోటు చేసుకుందని అన్నారు. విజిటింగ్ గ్యాలరీ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల దుండగులు దూకి ఎంపీ ల మధ్యలోకి దూసుకొచ్చి, కలర్ స్మోక్ విడుదల చేశారని , ఆ సమయంలో తాను పార్లమెంట్ లోపలే ఉన్నానని అన్నారు. దుండగులకు బీజేపీ ఎంపీ పాసులు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. ఏది ఏమైనా ఈ ఘటన జరగడం దేశ చరిత్రలో ప్రధమం అన్నారు.
దీన్ని కేంద్రం ఎంతో సీరియస్ గా తీసుకొని , విచారించి, వాస్తవాలు ప్రజలముందు ఉంచాలని స్పీకర్ ను కోరామని చెప్పారు. భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రతా పరంగా , టెక్నాలజీ పరంగా ఎన్నో చర్యలు తీసుకోవాలని, ఎయిర్ పోర్ట్ లో మాదిరిగా బాడీ మొత్తం స్కాన్ చేసే మిషన్లను పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎంపీ లు మీడియాతో అవినాభావ సంబంధాలు కలిగి ఉంటారు కనుక పార్లమెంట్ లో ప్రత్యేకించి, ఎక్కడో ఒక చోట మీడియాకు ఏర్పాట్లు చేయాలని నామ నాగేశ్వరరావు సూచించారు. ఏది ఏమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం, దురదృష్టకరమని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.