తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు.
ఇది మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది.