పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థిగా బాబ్జి, జనసేన అభ్యర్ధి గుణ్ణం నాగబాబుపై గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు వైసీపీ గెలవగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైవిధ్యం కోరుకుంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ఈసారి త్రిముఖపోటీ ఉండడంతో పోటీని తట్టుకుని నిమ్మల గెలిచారు. టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రామానాయుడు సొంతంగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రధాన కాల్వలు, డ్రెయిన్లను 18 కోట్ల రూపాయలతో ఆధునీకరించడంతోపాటు గ్రావెల్ రోడ్లు వేయడం ఆయనకు కొలిసొచ్చాయని చెప్పుకోవాలి.
అయితే రాజకీయాలకు అతీతంగా ఉండే నిమ్మల వైసీపీలో చేరి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో పాలకొల్లు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మరో నెలరోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ని కలిసి తన కార్యాచరణ ప్రకటిస్తానని, జగన్ వైసీపీలోకి తనను అంగీకరించకపోతే టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరపున ఎన్నికలకు వెళ్తానని నిమ్మల చెప్తున్నారు.