గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని వెల్లడించింది.
