వైఎస్సార్పీసీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం వెనక్కు తీసుకుందని ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ స్పష్టత నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థికసాయంపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఒక బిలియన్ (రూ.6,886 కోట్లు) డాలర్ల మేర ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థికసాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొన్నదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరెక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
రాజధాని ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తామని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విపత్తు నివారణ వంటి రంగాలకు ఒక బిలియన్ డాలర్లు అందించేందుకు అంగీకరించింది. అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు మద్దతివ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోనే ఆ వ్యవహారం నుంచి వరల్డ్ బ్యాంక్ తప్పుకున్నట్టు తెలిపింది. ఈక్రమంలోనే.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచబ్యాంక్ వివరించింది. ఇక.. గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేసింది.