Home / ANDHRAPRADESH / కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?

కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?

టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, బుద్ధా వెంకన్న లాంటి తోటి టీడీపీ నేతలపై సెటైర్లు వేస్తుండడంతో ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చు అని స్వయంగా జిల్లా టీడీపీ నేతలే భావిస్తున్నారు. ఇక జిల్లాలో కీలక నేతలుగా ఉన్న బోండా ఉమ, వల్లభనేని వంశీలుకూడా పార్టీని వీడి వైసీపీలో చేరే అవకాశం ఉంది.

బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నుంచి ఈ ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోగా, వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం నుంచి గెలుపొందారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు గెలుపొందారు. ఓటమి తర్వాత జిల్లాలో టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్ల వార్‌ పార్టీ బెజవాడ నడిబజార్‌లో టీడీపీ పరువు తీసిందనే చెప్పాలి. ఇక మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకోగా బెజవాడ ఎంపీ కేశినేని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , నూజివీడు నియోజకవర్గ ఇన్ చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వర రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ , గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయిన ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం త్వరలోనే బీజేపీ – వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

ఇక కృష్ణా జిల్లాలో పతనావస్థలో ఉన్న టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో తనపై ఓడిపోయిన దేవినేని అవినాష్‌‌ను వైసీపీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు కొడాలి నాని.. ఇక టీడీపీకి మున్ముందు భవిష్యత్తు లేదని భావిస్తున్న దేవినేని అవినాష్‌కు విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే బాధ్యత నాది అని కొడాలి నాని దేవినేని అవినాష్‌కు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. విజయవాడ తూర్పులో భవ్యప్రసాద్, యలమంచిలి రవి వర్గాల మధ్య విబేధాల నేపథ్యంలో కొడాలి నాని ప్రత్యామ్నాయంగా దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. జగన్‌ కూడా విజయవాడ తూర్పులో విబేధాల నేపథ్యంలో బలమైన నాయకత్వం ఉండాలని భావిస్తుండడంతో కమ్మ సామాజికవర్గానికే చెందిన దేవినేని అవినాష్‌ చేరికకు సముఖంగా ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది.

ఇక కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆప్తమిత్రుడు. పార్టీలకతీతంగా వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. నిజానికి రాజకీయంగా తనకు ప్రత్యర్థిగా ఉన్న దేవినేని ఉమాకు చంద్రబాబు – లోకేష్ ఎక్కువ ప్రయార్టీ ఇవ్వడాన్ని వంశీ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న వంశీ ఎన్నికల సమయంలోనే వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి కానీ…ఎందుకనో చేరలేదు. తాజాగా టీడీపీని జిల్లాలో నిర్వీర్యం చేయాలని భావిస్తున్న కొడాలి నాని వంశీని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం. కావల్సి వస్తే ఏకంగా అధ్యక్షుడు జగన్‌తోనే వంశీతో మాట్లాడించి పార్టీలో చేర్చుకునేందుకు కొడాలి నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బోండా ఉమ వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్న ఆయన దూకుడు స్వభావం, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నడుమ అధ్యక్షుడు వైయస్ జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

అయితే బోండా ఉమ సుజనా చౌదరితో టచ్‌లో ఉన్నాడని, ఒక వేళ వైసీపీలో చేరే అవకాశం లేకపోతే బీజేపీలో చేరేందుకు బోండా ఉమ రెడీగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేతో పాటు, దేవినేని అవినాష్ వంటి యువనేత, తన సామాజికవర్గానికే చెందిన టీడీపీలో ఉన్న మీడియం రేంజ్ లీడర్లను వైసీపీలో చేర్చి టీడీపీని పూర్తిగా బలహీనపర్చాలని కొడాలి నాని పెద్ద స్కేచ్చే వేసినట్లు తెలుస్తోంది. ఇక మండలి బుద్ధ ప్రసాద్‌కూడా వైసీపీలో లేదా బీజేపీలో చేరడం ఖాయమని…ఇంకా టీడీపీలో కొనసాగే ఆలోచన ఆయనకు లేదని మండలి అనుచరులు అంటున్నారు. మొత్తానికి కొడాలి నాని చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ దుకాణం బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కృష్ణా జిల్లా టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వంటి యువనేతలు పార్టీని వీడితే టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడుతుందని తెలుగు తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తం అవుతోంది.