బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ అని మెచ్చుకున్న సంగతి లక్ష్మణ్కు తెలియదా..? రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర సర్కారుకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అయినా చిల్లిగవ్వ కూడా ఇవ్వని మీ పార్టీతో బంగారు తెలంగాణ సాధ్యమా..? ఇది ప్రజలను మోసం చేయడం కాదా..? అంతే కాదు కాళేశ్వరానికి నిధులు ఇవ్వాలని, జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకున్నా రూపాయి కూడా విదిలించని మీరు బంగారు తెలంగాణ చేస్తారంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా..?
యూపీఏ-2 ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మూలన పడేసింది మీ ప్రభుత్వం కాదా..? ఆ ప్రాజెక్టు వస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికేవి. ఎన్నిసార్లు కేంద్రానికి దరఖాస్తులు చేసుకున్నా బుట్టదాఖలు చేశారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లులను కేంద్ర సర్కార్ బుట్టదాఖలు చేసిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియదా…? విభజన హామీల విషయంలో కేంద్ర సర్కార్ ఐదేళ్ల కాలంలో కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. ఈ విషయాల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎప్పుడైనా కేంద్రప్రభుత్వాన్ని అడిగిందా..? మా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారా..? మీరు బంగారు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది..? హార్టికల్చర్ యూనివర్సిటీ ఏమైంది..? ఖమ్మం జిల్లా బయ్యారంలో నిర్మించ తలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏమైంది..? ఖాజీపేటలో పెడతామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..? వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తామన్న గ్రాంట్లు ఏమయ్యాయి? తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని మూడేళ్లు గడుస్తున్నా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు ఏమయ్యాయి..?
ఈ హామీల అమలు కోసం గత ఐదు సంవత్సరాలుగా లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా కనీస చలనం లేదు. స్వయంగా నేను నాడు పార్లమెంట్ సభ్యుడిగా పలుమార్లు లోక్సభలో ప్రస్తావించినా ఫలితం శూన్యం. ఇలా చెప్పుకుంటూ పోతే, కేంద్రంలోని మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి విషయంలో అడుగడుగునా వివక్ష చూపించింది. మీరు మాతో బంగారు తెలంగాణ సాధ్యం అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడం కాక ఇంకేమౌతుంది..? అంతెందుకు గత ఐదున్నర సంవత్సరాలలో విభజన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని ఎన్ని సార్లు కలిశారో చెప్పాలి..?
రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోగా… మీ జాతీయ అధ్యక్షుడు అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్ముతున్నాడు. అబద్దాలు చెబుతూ వచ్చాడు. సమయం సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభలో, నిన్నటికి నిన్న లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన రోజును బ్లాక్ డేగా వర్ణించారు. అంతకుముందు రాష్ట్రానికి వచ్చి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు అబద్దాలు చెప్పారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దానిపై వివరణ ఇస్తే ఇంతవరకు మీ వైపు నుంచి సమాధానం లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మారు. తల్లిని చంపి పిల్లను బ్రతికించారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీహార్లో జరిగిన ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను విభజించినవాళ్లే దేశాన్ని విభజించాలనుకుంటున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మింది తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు.
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసిన మీ పార్టీ ఆ తర్వాత మూడు రాష్ట్రాలు ఇచ్చారే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఆనాటికే ఇక్కడ టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో వ్యతిరేక వైఖరితో ఉంది.
2014లో తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించే సందర్భంలో మీ కేంద్ర నాయకత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది వాస్తవం కాదా..? రాజ్యసభలో సవరణల పేరుతో బిల్లును అడ్డుకోవాలని కుట్రలు చేసింది నిజం కాదా..? ఏనాడూ మీ పార్టీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని, చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. అలాంటి మీతో బంగారు తెలంగాణ సాధ్యమా..? ఇది మేం నమ్మాలా..? ప్రజలకు వాస్తవాలు తెలియదనుకుంటున్నారా..? మీ విద్వేష రాజకీయాలను, తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ప్రజలు ఎన్నటికీ మరచిపోరు..!
మాజీ పార్లమెంటు సభ్యులు-పెద్దపల్లి
Post Views: 318