తాజాగా డల్లాస్ లో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై పెద్దఎత్తున ప్రత్యర్ధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కచ్చితంగా ఈ వ్యవహారానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహనరెడ్డికి ఎంత చులకనభావమో చూడండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళూ పూజలు చేసినట్లు, పుష్కరాల్లో మునిగినట్లు హిందువుల ఓట్లకోసం నటించి, దాటేదాకా ఓడ మల్లన్న-దాటేశాక బోడిమల్లన్న అనే రీతిలో డల్లస్‌లో జరిగిన సభలో జ్యోతిప్రజ్వలన చేయడానికి జగన్మోహనరెడ్డి ఎలా నిరాకరించారంటూ విష ప్రచారం చేస్తున్నారు..
అంతేకాదు.. ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు జ్యోతి వెలిగించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగమని, దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మంచి పని ప్రారంభించేటప్పుడు అది నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ యావత్ భారతజాతి జ్యోతిని వెలిగిస్తుందంటూ నీతులు చెప్తూనే అటువంటి హైందవ సంప్రదాయాన్ని అహంభావంతో తృణీకరించి, నిర్వాహకులు బతిమాలుతున్నా మొండిగా చేతులు బిగించి హైందవాన్ని, హిందువులను హేళన చేస్తున్న జగన్ వల్ల హిందూ ధర్మానికి మంచిది కాదంటూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమయంలో సీఎం పక్కనే ఉండి అన్ని ఘటనలకూ ప్రత్యక్షసాక్షిగా ఉన్నటువంటి మణి అన్నపురెడ్డి అనే జగన్ అనుచరుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
“ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవాలి! ఎంత తప్పుడు ప్రచారం చేసున్నారో చూడండి.. స్టేడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పూర్ణకుంభ స్వాగతం, వేదపండితుల ఆశ్వీరాదం తీసుకొని, ఆ తరువాత హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని లోపలికి వచ్చాడు జగనన్న..
స్టేడియం లోపల స్టేజీ మీద ఉన్న జ్యోతి వెలిగించటానికి సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదని, లోపల లైటర్ కానీ అగ్గిపెట్టె కానీ అసలు నిప్పు వెలిగించకూడద.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్టేడియం లోపల అలాంటి పోగ్రాంలు అనుమతించరని చెప్పుకొచ్చారు.
ఆవిషయం తెలిసే తాము ఎలక్ట్రిక్ క్యాండిల్స్ పెట్టగా.. అన్న వచ్చినప్పుడు చిన్న అగ్గిపుల్లతో ఎలక్ట్రికల్ క్యాండిల్స్ ని వెలిగిస్తున్నట్లు కెమెరాల వైపు చూడమని విలేకర్లు అడిగితే జగనన్న నవ్వుతూ నాకు బాబు లాగా యాక్షన్ చేయటం రాదబ్బా అని నవ్వేసాడంటూ వివరణ ఇచ్చారు. అసలు దీనిలో ఏమైనా తప్పు ఉందా ? ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ని వెలిగిస్తున్నట్లు నాటకాలు ఆడితే భక్తి ఉన్నట్లా.? నిజాయితీగా మనం చిన్న పనిలో కూడా మోసం చేయకూడదని అంటే భక్తి లేనట్లా.? అని ప్రశ్నించారు.భక్తి , మతం ముసుగులో ఓట్ల రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీళ్ళని అడ్డుకోకపోతే ఎంతకైనా దిగజారి పవిత్రమైన మతాన్ని బ్రష్టుపట్టించటం ఖాయమన్నారు.
ఈ సంఘటనలో జగన్ పక్కనే ప్రత్యక్ష సాక్షిగా తానున్నానని, తాను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమేనని సవాల్ విసిరారు. దీంతో మణి అన్నపురెడ్డి వ్యాఖ్యలకు సర్వత్రా మద్దతిస్తున్నారు. అసలు అది ఇండియా కాదని, ఎలా పడితే అలా స్టేడియంలో ఫైర్ చేయడానికి అక్కడ ఒప్పుకోరు కాబట్టి ఎలక్ట్రికల్ క్యాండిల్స్ పెట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలికారని చెప్తున్నారు. విజయవాడలో గుడులు కూల్చేసినపుడు దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎందుకు కిమ్మనలేదని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలు చేయొద్దని సలహాలిస్తున్నారు.