రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి మాజీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఒక్క అబద్ధం చెబుతుంటే లోకేష్ పది చెబుతున్నారని మండిపడ్డారు.. బుధవారం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని పరామర్శించకుండా లోకేశ్ కేవలం ట్వీట్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. నెల్లూరులో పేదల ఇళ్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్ స్పష్టంచేశారు. అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి అనుమతితోనే రివర్స్ టెండరింగ్ చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు చేసే దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. కృష్ణానదిలో నీటిమట్టం పెరగడం వల్లే కొండవీటి వాగుకు వరద వచ్చిందని అన్నారు. పప్పునాయుడు అవగాహనతో ట్వీట్లు చేస్తున్నట్లు లేదన్నారు. వరద సందర్భంగా తాము అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నా చంద్రబాబు కుటుంబం పార్టీలకు వెళ్తున్నారని, ప్రజలెవ్వరూ విమర్శించకపోయేసరికి లోకేశ్ జూ.ఆర్టిస్టులను రంగంలోకి దింపారంటూ విమర్శించారు. చౌకబారు పనులు మానుకోవడం మంచిదని సూచించారు.
